Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page

కోనసీమ ఘనత

మూడువేల యేండ్ల క్రిందట వ్యాకరణ సూత్రములు వ్రాసిన పాణిని యిప్పుడు పాకిస్తాన్‌లో నున్న తక్షశిల (టేక్సీలా) వాసి, అతని విద్యాభ్యాసము మగధదేశములోని పాటలీపుత్రము (పాట్నాలో) అట్టివాడు ఈ ప్రాంతములో అప్పటి పండితులయొక్కయు, విద్వాంసులయొక్కయు ప్రజ్ఞావిశేషముల యెరుకవల్లనే తన గ్రంథములో ''సప్తగోదాపరమ్‌'' అని, గోదావరీమండలమును ''పంచనదమ్‌'' అని ఈకోనసీమను పేర్కొన్నాడు, దీనిని బట్టి ప్రాచీనకాలంలోనే ఈ ప్రాంతం యెంత ప్రాశస్త్యము బడసెనో మనము గ్రహించగలము.

ఇచ్చట అన్నిటికీ వేదమే మూలము. రామాయణానికి, భారతానికీకూడా వేదమే ప్రాతిపదిక, ''ఉద్ధరే దాత్మ నాత్మానం'' అని, ప్రతివానికి తన ఆత్మను పరిశుద్ధపరచుటయే కర్తవ్యము, అప్పుడు అంతా ప్రేమమయం అవుతారు, అట్టి సమభావంచేత ఆనందము కలుగుతుంది. అట్టి ఆనందమే బ్రహ్మస్వరూపమ్‌,''ఆనందో బ్రహ్మ'' అట్టి బ్రహ్మత్వాన్ని సాధించుటకై యజ్ఞదానములు సాధన మార్గములు, అంతా దైవమయంగా చూడాలి, ఆవిధంగా ఆచరించిన వారు మనఋషులు. వారి పవిత్రనామములు మన ''ప్రవర''లలో వింటూంటాము. అట్టి ఋషు లిచ్చట పెక్కుమంది నివసించేవారు, వేదప్రచారము, ధర్మప్రబోధము వారు చేస్తూ వుండేవారు. వేదవిద్య నేర్చుకొనే వారికొరకు శ్రీ పెద్దాపురంసంస్థానంవారు యిచ్చట అనేకమందికి మాన్యాలిచ్చారు, ఆరోజులలో కాలవలు లేవు. ఆనకట్టలు లేవు, అన్నీ మెట్టపంటలే, అప్పుడు పండే సజ్జలతోనే వేదాన్ని పోషించేవారు. ఆనకట్టలతో వరిపంటలు వచ్చాయి, దానితోటే చదువులు, ఉద్యోగాలు వచ్చాయి. వేదాలు హ్రస్వించిపోయాయి. అగ్ని హోత్రాలు తగ్గిపోయాయి. ఈ విధంగా కోనసీమలో కూడా వేదవిద్యలు క్షీణించిపోయాయి. కాని పూర్వఋషుల అనుగ్రహంవల్ల ఇప్పుడుకూడా కొంచెంగా వింటూవుంటాము. కాని వేదపురుషుడే పరమేశ్వరుడు, వేదమే అన్ని విద్యలకు మూలం. వేదమే లేకపోతే అంతా అంధాకారమయమే, అవుతుంది, ఈ వేదజ్యోతి ఆరిపోకుండా చూచుకోవడం మనధర్మం, పామరులకు కూడా ఈ జీవితంలోనే బ్రహ్మసాక్షాత్కారం కలగడానికి వేదం త్రోవచూపిస్తుంది. తిరిగి పూర్వపు టౌన్నత్వాన్ని పొందవలెననే దృష్టి మనకు కలగాలి. అట్లాంటి దృష్టివుంటే మహాఋషుల అనుగ్రహంతో ఎప్పటికైనా మనం పైకి రాగలము. వెయ్యిమంది ప్రయత్నిస్తే ఒక్కడు సాధించవచ్చు. వేదపురుషుని అనుగ్రహం వుంటే తిరిగి పూర్వపు టౌన్నత్వాన్ని పొందవచ్చు. అప్పుడు ఇచ్చట ఓషధులకూ లోపంవుండదు. విద్యలకూ లోపం కలుగదు. ఈ విధంగా వేదం శాఖోపశాఖలుగా వృద్ధి కావాలని, వేదానికి తిరిగి నారుమళ్లు (నర్సరీలు) ఏర్పడవలెనని, ఈసస్యములు ప్రపంచమంతా వ్యాపించవలెనని, యథార్థానికి అన్ని సీమలు కూడా కోనసీమలుకావాలి అని శ్రీవారు హెచ్చరించారు.

పూర్వకాలంలో పృథుచక్రవర్తి మాంథాత, జనక మహారాజు మున్నగు వారీకార్యభారంవహించే వారని, దరిమిలా ఉత్తరాదిని కాయస్థులు, ఠాకూర్లు మున్నగు వారును, దక్షిణాదిని పిళ్ళెలు, ముదలియార్లు, వెల్లెవులును, ఈ ప్రాంతములో వెలమలు, రెడ్లు, క్షత్రియులు మున్నగు భూస్వాములు వేదములను పోషించేవారు. రాజులు ధర్మాన్ని మాత్రమే పాలించేవారు. ఈ విద్యాపోషణ అంతా యిటువంటి ''భూమిహార్ల'' వల్లనే జరిగేది. కాని యిప్పుడంతా ''ప్రజాపాలన'' అయిపోయింది. ఇప్పటి గ్రామపంచాయతీలలో అంతా సంకరమే, ఇచ్చట శుద్ధి, అశుద్ధి విచక్షణ లేదు, పూర్వకాలపు జాతి పంచాయతీలో తప్పుచేసేవాడిని శుద్ధం చేయించడం, అపరాధం చేయించడం వుండేవి. ఇప్పుడప్పుడే ఈ గ్రామపంచాయతీలను తీసి వేయించాలనే ఉద్యమం కూడా బయలుదేరింది.


Jagathguru Bhodalu Vol-8        Chapters        Last Page